భారతీ శంకర పీఠం గురించి

హైందవ ధర్మం అతి సనాతన ధర్మాలలో ఒకటి. విశ్వకల్యాణమే ధర్మంగా, ఉద్దేశంగా సాగుతున్న మతాలలో హిందూ మతం ఒకటి.

హైందవ సనాతన గొప్పతనాన్ని ప్రజలు మరింత లోతుగా తెలుసుకునేందుకు వీలుగా, హైందవ ధర్మ సంస్కృతి పరిరక్షణ కోసం బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తిగారిచే స్థాపించబడింది ఈ భారతీ శంకర పీఠం. హిందూ ధర్మాన్ని , ఆచారాలను, సంస్కృతిని పరిరక్షించడం, ధర్మ ఔన్నత్యానికి కృషి చేయడమే విధిగా, అది మా భాగ్యంగా భావిస్తున్నాం. ధర్మాన్ని రక్షిస్తే.. ఆ ధర్మమే మనను రక్షిస్తుంది అని నమ్ముతూ.. ధర్మ వ్యాప్తికి కృషి చేయాలని సంకల్పించాము. దీని కోసం జీవన సారాన్ని, ధర్మ సారాన్ని బోధించి నిగూఢ రహస్యాలను వెల్లడించే వేదాలను సంరక్షించడం భారతీ శంకర పీఠం బాధ్యతగా తీసుకుంది.

వేద పరిరక్షణ నిమిత్తం నిష్ణాతులైన వేద పండితులతో వేద సభలు ఏర్పాటు చేసి వేద ప్రాశస్త్యం, దివ్యత్వాన్ని పరివ్యాప్తి చేయడం జరుగుతుంది. అంతే కాకుండా వేద పాఠశాల నిర్వహణ కూడా చేయడానికి మా కృషి కొనసాగుతుంది. ఆ సంకల్పంతో పాటు గోశాల నిర్వాహణ, మహా త్రిపురసుందరీసహిత మహాలింగ మృత్యుంజయ ఆలయ (శివాలయం) నిర్మాణం చేయడం కూడా మా అభిమతం. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. అందుకే నిత్యాన్నదానం చేయడంతో పాటు, లోక కల్యాణం కోసం యజ్ఞయాగాది క్రతువులను బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తిగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.

 

బహ్మ శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి గారి గురించి...

భారతీ శంకర పీఠం స్థాపకులైన అన్నవరపు తిరుపతి మూర్తి గారు ఉభయ వేదాంత ప్రతిష్ఠాంత పండితులు. ఆయన విజయవాడలోని శ్రీ జగద్గురు పాదుకా క్షేత్రంలోని శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానంలో ప్రధాన అర్చకులుగా విధులు నిర్వహించారు. వేదము తెలిసిన వారు, యజుష స్మార్త పూర్వ ప్రయోగంలో పంచదశ కర్మ విభాగంలో ఉత్తీర్ణత సాధించారు. వేదం, స్మార్త, ఆగమ, జ్యోతిష్య, ధర్మ, ప్రవచన శాస్త్రాలలో ఆయన నిష్ణాతులు.